గిరిజనుల జీవితాల్లో సేవా వెలుగులు

రేగ పుణ్యగిరి గిరిజనులకు కెజియా ఫౌండేషన్ వస్త్రాల పంపిణీ
🖨️ Print

అక్షర ఆయుధం న్యూస్: నవంబర్ 1( బి.బుజ్జిబాబు అల్లూరి జిల్లా ప్రతినిధి): గిరిజనుల సంక్షేమమే లక్ష్యంగా కెజియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నూతన వస్త్రాల పంపిణీ కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని కొండ ప్రాంతమైన రేగ పుణ్యగిరి గ్రామాన్ని సందర్శించిన ఫౌండేషన్ సభ్యులు అక్కడ నివసిస్తున్న గిరిజనులకు తమ వంతు సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన 10 మంది పురుషులకు ఒక్కొక్కరికి ఒక లుంగీ, ఒక తెల్ల చొక్కా చొప్పున నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. గిరిజన గ్రామాల్లో సమస్యలపై దృష్టి సారించాలి! రేగ పుణ్యగిరి గ్రామంలో తాగునీరు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, గ్రామస్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని స్థానిక సమస్యలపై స్పందించారు. సేవా కార్యక్రమాల్లో భాగంగా పేదలకు సహాయం అందించడంతో పాటు, గిరిజన గ్రామాల్లో నెలకొన్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడమే తమ లక్ష్యమని కెజియా ఫౌండేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కెజియా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అధ్యక్షులు బూర్జ బారికి జోసెఫ్ ప్రసాద్‌తో పాటు అప్పలనాయుడు, చిన్నమ్మి, సంజు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *