
సింగరేణి, సెప్టెంబర్ 2 (అక్షర ఆయుధం న్యూస్):ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు కొండబోయిన నాగేశ్వరరావు మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలు, వందలాది హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు.సింగరేణి మండలంలో బుధవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకుడు పండగ కొండయ్య అధ్యక్షతన సమావేశం జరిగింది.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రకటించినప్పటికీ, వెయ్యి రోజుల పాలనకు చేరుకున్నా అనేక హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని నాగేశ్వరరావు అన్నారు. ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ల పెంపు వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు సంబంధించి ప్రకటించిన పెంపును పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపులు, రెండో విడత ఇళ్ల మంజూరుపై స్పష్టత ఇవ్వాలని కోరారు.సింగరేణి మండలానికి సీతారామ ప్రాజెక్టు నీరు ఎప్పుడు? అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.భూముల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. భూభారతి ప్రక్రియలో పేదలు, చిన్న రైతులు ఇబ్బందులు పడకుండా వారి భూములకు హక్కు, రక్షణ కల్పించాలని కోరారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నాగేశ్వరరావు విమర్శించారు. రోడ్లు, ఇందిరమ్మ ఇళ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాల్లో పారదర్శకత పాటించాలని డిమాండ్ చేశారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు.ప్రజా సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైతే సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజల హక్కుల కోసం ఎర్రజెండా నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో మండల కార్యదర్శి కే. నరేంద్ర, డివిజన్ కమిటీ సభ్యులు వజ్జ రామారావు, కే. ఉమావతి, రేగళ్ల మంగయ్య, అజ్మీర శోభన్ బాబు, జి. వెంకన్న, ఎం.డి. ఇస్మాయిల్, శాఖ కార్యదర్శులు కురసం శ్రీను, దార్ల బాబు, ఎజ్జు ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.