
(అక్షరాయుధం న్యూస్ సెప్టెంబర్ 2) రిపోర్టర్ శివలింగం వేములవాడ రాజన్నా సిరిసిల్ల జిల్లా వేములవాడలో హోరెత్తిన బీఆర్ఎస్ నిరసన ర్యాలీ కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన కేవలం వైఫల్యాలు, మోసాలతోనే నిండిపోయిందని ఆరోపిస్తూ భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో వేములవాడ పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక కోరుట్ల బస్ స్టాండ్ చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని 420 అడుగుల ఫ్లెక్సీతో నిరసన ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కోరుట్ల బస్టాండ్ చౌరస్తా పరిసరాలను హోరెత్తించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. ఎన్నికల వేళ ప్రజలకు 420కి పైగా మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని, వంద రోజుల్లో నెరవేరుస్తామన్న వాగ్దానాలు 1000 రోజులు గడుస్తున్నా అమలకు నోచుకోలేదని విమర్శించారు. రైతులు, మహిళలు, యువత, వెనుకబడిన వర్గాలను ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, ఆ మోసపూరిత వైఖరిని ఎండగట్టడానికే ఈ 420 అడుగుల ఫ్లెక్సీతో వినూత్నంగా ర్యాలీ చేపట్టామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆరు గ్యారెంటీలతో పాటు ఇచ్చిన అన్ని హామీలను తక్షణమే నెరవేర్చాలని, లేనిపక్షంలో నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజలను సమీకరించి పోరాటాలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్లా జిల్లా మాజీ జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిలతో పాటు నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.