
సింగరేణి, సెప్టెంబర్ 2 (అక్షర ఆయుధం న్యూస్):సింగరేణి మండలం మాదారం గ్రామపంచాయతీ ప్రజల చిరకాల విద్యుత్ సమస్యలకు త్వరలో తెరపడనుంది. గ్రామంలో సుమారు రూ.3.5 కోట్ల అంచనా వ్యయంతో నూతన విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. సబ్‌స్టేషన్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని సిద్ధం చేసే పనుల్లో భాగంగా బుధవారం వైకుంఠధామం సమీపంలోని డంపింగ్ యార్డు పక్కన సుమారు 25 గుంటల స్థలాన్ని చదును చేశారు.మాజీ సర్పంచ్ అజ్మీర నరేష్ నాయక్ ఆధ్వర్యంలో స్థలాన్ని చదును చేసే పనులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ మాట్లాడుతూ సబ్‌స్టేషన్ ఏర్పాటుతో మాదారం పరిసర గ్రామాల ప్రజలకు విద్యుత్ సరఫరాలో గణనీయమైన మెరుగుదల ఏర్పడుతుందని తెలిపారు.ప్రస్తుతం గ్రామ పరిసరాల్లో తరచూ ఎదురవుతున్న లోవోల్టేజ్, విద్యుత్ సరఫరా అంతరాయాల కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ సీజన్‌లో సరైన విద్యుత్ అందక పంటలకు నీరు అందించలేక రైతులు నష్టపోతున్నారని తెలిపారు. కొత్త సబ్‌స్టేషన్ అందుబాటులోకి వస్తే విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తగ్గడంతో పాటు రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందే అవకాశం ఉంటుందని చెప్పారు. మంత్రుల చేతుల మీదుగా శంకుస్థాపన సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు త్వరలో రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక–విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు ఎంపీల సమక్షంలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా గ్రామంలో స్త్రీ శక్తి, అంగన్వాడీ భవనాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయనున్నట్లు వెల్లడించారు.యాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్వాగతించి, అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని సర్పంచ్ అజ్మీర ఉమా నరేష్ కోరారు. సబ్‌స్టేషన్ నిర్మాణం పూర్తయితే మాదారం మాత్రమే కాకుండా పరిసర గ్రామాల రైతులు, ప్రజలకు విద్యుత్ సమస్యల నుంచి గణనీయమైన ఉపశమనం లభించనుందని ఆశాభావం వ్యక్తం చేశారు.