తమ విద్యకు పునాదిని ఎంచుకోవడం ముఖ్యం : బీసీ నాగరాజ్

అక్షర ఆయుధం,కుప్పం, సెప్టెంబర్ 02,రిపోర్టర్ : తేజ కిరణ్ : కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ ప్రథమ సంవత్సరం విద్యార్థుల తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బుధవారం నాడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి BCN విద్యాసంస్థల చైర్మన్ డా. బి.సి. నాగరాజ్ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డా. బి.సి. నాగరాజ్ మాట్లాడుతూ, కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో విశ్వవిద్యాలయ స్థాయి విద్యకు అనుగుణంగా అత్యాధునిక సదుపాయాలు, నాణ్యమైన విద్యా వాతావరణం అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కళాశాలలో ఉన్న విద్యా, సాంకేతిక, మౌలిక వసతులను విద్యార్థులు సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని తమ జీవిత లక్ష్యాలను సాధించాలని ఆకాంక్షించారు." తమ బి.టెక్ విద్యాభ్యాసానికి కుప్పం ఇంజనీరింగ్ కాలేజీని ఎంచుకోవడం విద్యార్థుల భవిష్యత్తుకు మంచి పునాది" అని ఆయన పేర్కొన్నారు. క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నిరంతర అభ్యాసం, నైపుణ్యాభివృద్ధి వంటి లక్షణాలను అలవర్చుకున్న విద్యార్థులు జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.
ఈ కార్యక్రమంలో కుప్పం ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్మన్ డా. ఎన్. సునీల్ రాజ్ మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి జీవితంలో ఒక గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉంటాడని, అయితే ఆ లక్ష్యాన్ని సాధించేందుకు నిరంతర పట్టుదలతో ముందుకు సాగేవారే చివరకు విజయాన్ని అందుకుంటారని అన్నారు. లక్ష్య సాధనలో ఎదురయ్యే అవరోధాలకు భయపడి వెనక్కి తగ్గడం విజయానికి ప్రధాన అడ్డంకిగా మారుతుందని తెలిపారు. అవరోధాలను సమస్యలుగా కాకుండా అవకాశాలుగా భావించి, వాటిని అధిగమించేందుకు సరైన మార్గాలను అన్వేషించాలని విద్యార్థులకు సూచించారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా విద్యార్థులు కుంగిపోకుండా, వెనుకడుగు వేయకుండా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అవరోధాలపై ఆధిపత్యం సాధించే సంకల్పం ఉన్న ప్రతి విద్యార్థికి విజయం తప్పక సొంతమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాతృభూమి మోటివేషన్, హైదరాబాద్ డైరెక్టర్ మరియు మోటివేషనల్ స్పీకర్ శ్రీ నాగప్రసాద్ పాల్గొని విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ అవకాశాలపై అవగాహన కల్పించారు.ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు కేవలం విద్యార్హతలకే పరిమితం కాకుండా సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ స్కిల్స్, సమస్య పరిష్కార నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు, టీమ్ వర్క్ వంటి విభిన్న నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. కార్పొరేట్ ప్రపంచంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించాలంటే నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవడం అత్యవసరమని ఆయన నొక్కి చెప్పారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎస్. సుధాకర బాబు, వైస్ ప్రిన్సిపాల్ డా. ఎస్. భాస్కరన్, R&D విభాగాధిపతి డా.జి.ఎన్.. కోదండరామయ్య, గ్రంథాలయ విభాగాధిపతి డా.సి.జి. శరవణ, హ్యుమానిటీస్ అండ్ సైన్సెస్ విభాగాధిపతి జె. మాధవన్, వివిధ విభాగాధిపతులు, అధ్యాపకులు, PRO ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.