
(అక్షరం–ఆయుధం న్యూస్ రిపోర్టర్) బాలెం వెంకటేష్ డోర్నకల్, సెప్టెంబర్ 2:కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ శ్రేణులు డోర్నకల్ మండల కేంద్రంలోని మసీద్ సెంటర్ వద్ద భారీ నిరసన, ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను బీఆర్‌ఎస్ నాయకులు ప్రశ్నించారు. ముఖ్యంగా “13 డిక్లరేషన్లలో 420 హామీలు ఎక్కడ?”, “₹4,000 పింఛన్ ఎక్కడ?”, “గిరిజనులకు 18 శాతం రిజర్వేషన్లు ఎక్కడ?”, “మైనార్టీ సంక్షేమానికి ₹4 కోట్లు ఎక్కడ?”, “వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి ₹12,000 ఎక్కడ?”, “మెగా డీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయి?”, “నిరుద్యోగ భృతి ₹4,000 ఎక్కడ?”, “విద్యా భరోసా ₹5 లక్షలు ఎక్కడ?”, “ఆరు గ్యారెంటీలు ఎక్కడ?”, “ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 ఎక్కడ?” అంటూ నినాదాలు చేశారు.హామీలు–అమలు మధ్య అంతరం ఎంత?ధర్నాలో బీఆర్‌ఎస్ నాయకులు ప్రధానంగా ఎన్నికల హామీల అమలుపైనే దృష్టి సారించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ప్రజల్లో భారీ అంచనాలను కల్పించాయని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఎన్ని అమలయ్యాయి? ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయి? అనే అంశంపై ప్రభుత్వం స్పష్టమైన లెక్కలు ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.బీఆర్‌ఎస్ శ్రేణుల విమర్శల ప్రకారం, హామీ ఇవ్వడం మాత్రమే కాకుండా దాని అమలు స్థితిని ప్రజలకు వివరించడం ప్రభుత్వ బాధ్యత. ఏ హామీకి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎంతమందికి ప్రయోజనం అందింది? ఇంకా ఎన్ని కుటుంబాలు ల పొందాల్సి ఉంది? అనే అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని వారు కోరారు.‘బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందింది’ – రెడ్యానాయక్ఈ సందర్భంగా మాజీ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను సిరిసంపదల తెలంగాణగా తీర్చిదిద్దామని అన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి ప్రజల నుంచి మద్దతు పొందిందని, అయితే మీల అమలులో ప్రజలు తీవ్ర నిరాశకు గురవుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలే తమ ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధానం చెబుతారని పేర్కొన్నారు.చిలుకూరు నుంచి భారీగా బీఆర్‌ఎస్ శ్రేణుల తరలింపుడోర్నకల్ ధర్నా కార్యక్రమానికి చిలుకోడు గ్రామం నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో బైకులపై తరలివచ్చారు. గ్రామం నుంచి భారీగా కార్యకర్తలు పాల్గొనడంతో నిరసన కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.హామీలపై రాజకీయ వేడి పెరుగుతుందా? డోర్నకల్‌లో జరిగిన ఈ ధర్నా కేవలం ఒక రాజకీయ నిరసన కార్యక్రమంగానే కాకుండా ఎన్నికల హామీల అమలుపై అధికార–ప్రతిపక్షాల మధ్య పెరుగుతున్న రాజకీయ పోరాటానికి సంకేతంగా బీఆర్‌ఎస్ శ్రేణులు అభివర్ణిస్తున్నాయి అయితే ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని, ఇప్పటివరకు చేపట్టిన చర్యలను ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో బీఆర్‌ఎస్ ప్రస్తావించిన ప్రతి హామీకి సంబంధించిన వాస్తవ పరిస్థితి, ప్రభుత్వం చేసిన అమలు చర్యలు, బడ్జెట్ కేటాయింపులు, లబ్ధిదారుల సంఖ్య వంటి అంశాలను ఆధారాలతో పరిశీలించడం కూడా ప్రజలకు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కీలకం.హామీలు ఎవరు ఇచ్చారు..? ఎంత మేరకు అమలు చేశారు..? ఇంకా ఏమి అమలు కావాల్సి ఉంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రబిందువుగా మారాయి. రాబోయే రోజుల్లో ఈ అంశాలపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.ఈ కార్యక్రమంలో చిలుకోడు గ్రామ సర్పంచ్ రాయల వెంకటేశ్వరరావు, ఉప సర్పంచ్ రామనబోయిన రాజు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కాడెం బాబు, నూకల ఉపేందర్, కాడెం ప్రశాంత్, కాడెం రాఘవ, రామూర్తి, నూకల లక్ష్మీ నరసయ్య, దేశని ఉపేందర్, దేశని నాగన్న, జరుపుల వెంకన్న, పొన్నం సైదులు, నక్క నాగన్న, సమ్మెట శ్రీను, పొన్నం ఉపేందర్, అవనగంటి రమేష్, అవనగంటి రాములు, దడిగల సుధాకర్, కోట శ్రీనివాస్, బండ్ల నవీన్, బాధరబోయిన నాగన్న, మంద వెంకన్న తదితర బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.